Wednesday, April 23, 2008

సత్యం...శివం...సుందరం!


11 జూలై 2006, సాయంత్రం 6:15

ప్రతీ రోజులాగే బాంద్రా స్టేషన్ వైపు వడివడిగా అడుగులేస్తున్నాను. వీలైనంతవరకూ, నేను 18:20 బోరివలి లోకల్ ట్రైన్ మిస్ అవను. ముంబైలోని చాలమందికి అలవాటు - ప్రతీ రోజూ, ఆఫీసుకెళ్ళడానికి, తిరిగి ఇంటికెళ్ళడానికి ఒక నిర్ణీతమైన లోకల్ ట్రైను ఉపయోగిస్తుంటారు. ఈ రొటీన్లో సాధారణంగా మార్పుండదు. ముంబైకొచ్చిన రెండేళ్ళలొ, నేనూ ఇలా అలవాటు పడిపోయాను. అందుకే, సాయంత్రం ఇంటికెళ్ళడానికి వీలైనంతవరకూ 18:20 బోరివలి ఫాస్ట్ లోకల్ మిస్ అవడానికి ఇష్టపడను.

అసలు ముంబై నగరవాసులకూ, గడియారంలోని ముళ్ళకూ పెద్ద తేడా కనిపించందు నాకు. ప్రపంచంతో సంబంధం లేకుండా పరుగెత్తడాన్ని ముంబై నగరం ప్రతి ఒక్కరికీ అలవాటు చేస్తుంది. అది అనుభవిస్తే కాని అర్ధం కాదు. నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకొచ్చి, రెండో నంబర్ ప్లాట్ ఫాం వైపు దాదాపు పరుగులాంటి నడకతో వెళుతున్నాను. రైలు ప్లాట్ ఫాం మీద సిద్దంగా ఉంది. లోకల్ రైళ్ళు సాధారణంగా నలభై సెకన్లు పాటు ఆగుతాయి. నేను పరుగు వేగం పెంచాను. మెట్లు దిగగానే రెండవది నేనెక్కవలసిన ఫస్ట్ క్లాసు భోగీ. నేను చివరి మెట్టు మీద ఉండగానే ట్రైన్ స్టార్ట్ అయ్యింది. అది వేగం పుంజుకుంటుండగా, దాన్ని మిస్ అవ్వడం ఇష్టం లేక, అందుబాట్లో ఉన్న సెకండ్ క్లాస్ భోగీలోకి ఎక్కేసాను.

ఎప్పట్లానే భొగీ విపరీతమైన రద్దీగా ఉంది. అతికష్టం మీద, జనాన్ని తోసుకుంటూ లోపలికి రెండడుగులు వేసాను. చాలా విసుగ్గా ఉంది. ఫస్ట్ క్లాసులోనైతే ఇంత రద్దీ ఉండదు. నిదానంగా తరువాత ట్రైన్ క్యాచ్ చేసుండల్సింది... ఇలా ఆలోచిస్తుండగానే ఒక్క సారిగా పెద్ద శబ్ధం. ట్రైను దదాపు తలక్రిందలయ్యేంతగా ఊగి, ఒక్క కుదుపుతో ఆగిపొయ్యింది. ఎమౌతోందొ అర్ధం కాలేదు.

ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు "బాంబ్ హై! భాగో! అని. ఒక్క క్షణం నిచ్చేష్టుణ్నై, మెల్లగా ఆ తోపులాటలో పడి, పెద్దగా నా ప్రయత్నమేమీ లేకుండానే బయట పడ్డాను. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అంతా గందరగోళంగా ఉంది.

నెమ్మదిగా అర్ధమయ్యిందేంటంటే, ఫస్ట్ క్లాస్ భోగీలో బాంబు పేలింది..చాలా మంది చనిపోయారు/ గాయాపడ్డారు. ఇంకా ఎన్ని బాంబులున్నాయో తెలియదు... అందరూ దూరంగా పరుగెడుతున్నారు. మెల్లగా వాస్తవం నాకు పూర్తిగా అవగతమైంది.. నేను వెంట్రుకవాసిలో మిస్ అయిన ఫస్ట్ క్లాస్ భోగీలో బాంబు పేలింది. మరణానికీ, నాకూ మధ్య కొద్ది సెకన్ల తేడా.

అందరూ మెల్లగా తేరుకుని ఫస్ట్ క్లాస్ భోగీ వైపు అడుగులేస్తున్నారు. కొంతమంది ధైర్యస్తులు లోపలికి వెళ్ళి గాయపడిన వారికి సహాయం చేస్తున్నారు. అరుపులూ కేకలతో ఆ ప్రదేశమంతా గందరగోళంగా మారింది.

అదురుతున్న గుండెలతో, నిస్సత్తువగా నెమ్మదిగా అటువైపెళ్ళాను. ఓహ్ ...హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరాలు, భాదితుల ఆర్తనాదాలు, ఏడుపులూ, పేడబొబ్బలూ.. కలలో కూడా ఊహించలేని దృశ్యం. ఎవరు బ్రతికున్నారో, ఎవరు చనిపోయారో తెలియడం లేదు. చేయి తెగి భాదతో అరుస్తూన్న సర్దార్జీ, విగత జీవుడై పడి ఉన్న పార్శీ ముసలివాడు, రక్తపు మడుగులోని స్టాక్ బ్రోకరూ, స్టేట్ బాంక్ లో పని చేసే పలనివేల్... చాల వరకు తెలిసిన మొహాలే. గత రెండేళ్ళగా కలిసి ఒకే రైలుపెట్టెలో ప్రయాణిస్తున్నాము.. ఈరోజు నా అదృష్టం బాగుండి కొద్ది సెకన్ల తేడాతో ఆ బోగీ మిస్ అయ్యాను. లేకుంటే నేనూ వాళ్ళతోపాటుగా పడి ఉండేవాడిని.

చిత్రంగా, నేను బ్రతికి బయటపడ్డానన్న సంతోషం కలగడం లేదు. చావును అంత దగ్గరగా, అంత భయంకరంగా చూసిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.


దాదాపు పావుగంట పాటు అక్కడే రైలు పట్టాపై కూర్చుండిపోయాను. ఇంతలో, విషయం తెలిసి ఇంటినుంచి ఫోన్ వచ్చింది. నా క్షేమసమాచారం తెలియ చేస్తుండగానే మొబైల్ ఫోన్ మూగబోయింది. నెమ్మదిగా, కూడదీసుకుని స్టేషన్ చేరుకుని, టాక్సీలో ఇల్లుచేరాను. పలకరింపులకు యాంత్రికంగా సమాధానం చెబుతూ, నిశ్శత్తువగా సోఫాలో కూలబడ్డాను. నా పరిస్థితిని అర్ధం చేసుకున్న మా ఆవిడ నన్నెక్కువ డిస్టర్బ్ చెయ్యలేదు. విషయం తెలిసి, నాకు వస్తున్న ఫోన్లన్నిటికీ తనే సమాధానమిస్తోంది. TV లో న్యూస్ రీడరు చెపుతోంది - కొద్ది నిమిషాల తేడాతో ఏడు చోట్ల బాంబులు పేలాయనీ, మృతుల సంఖ్య దదాపు 150-200 ఉండొచ్చనీ..

ఆ రాత్రి అన్నంకూడా సహించలేదు. ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని మరచి పోలేకపోతున్నాను. ఒకరకమైన కసి, కోపం, నిస్సహాయతా నన్ను ముంచెత్తుతున్నాయి. రోజంతా పోట్టకూటికై పనిచేసి, అలసి సొలసి, తమ గూడు చేరుకుంటున్న ఆ అమాయకులు ఏం పాపం చేసారు? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? నాకు జీవితంలో మొట్ట మొదటి సారి భగంతుడిపై విపరీతమైన కోపమొచ్చింది. దేవుడు కరుణామయుడు, ఈ సృష్టి పరిపూర్ణమైనది అన్న నా నమ్మకం పూర్తిగా పెకలింపబడింది. ఇలా విపరీతమైన అవేశంతో, అలోచనలతో ఎప్పుడో అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నాను.

*** *** *** ***

చల్లటి స్పర్శ నా నుదుటిపై కలగడంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను. నాచుట్టూ, శరత్పూర్ణిమను మరిపించే చల్లటి ప్రకాశవంతమైన కాంతి...మృదుమధురమైన సన్నటి నవ్వు, నన్ను మలయమారుతంలా చుట్టేసింది. ఆ నవ్వుని బట్టి అర్ధమయ్యింది, నా ఎదురుగా ఎవరో ఉన్నారని... ఎవరో పోల్చుకోలేకున్నాను... కానీ, ఆ చిన్నటి నవ్వులో, స్పర్శలో జాలువారిన ప్రేమ నా మనసుకు తెలుస్తోంది. స్వాంతన కలిగిస్తోంది.



"ఎవరు నువ్వు....మీరు?" అయోమయంతో నా గొంతు పెగలడం లేదు.

మళ్ళీ అదే సెలయేటి గలగల లాంటి నవ్వు..."నా మీద నీకెందుకంత కోపం?"

"నువ్వు... ఐ మీన్, మీరు....దేవుడా?"..ఆశ్చర్యం, ఆనందం, ఇందాకటి కోపం, ఉక్రోషం,ఆవేదన...అన్ని భావాలు ఉప్పెనలా నన్ను చుట్టుముట్టాయి.

నా ప్రశ్నకు సమాధానం, మళ్ళీ చిరునవ్వే అయ్యింది. "నా మీద నీకెందుకంత కోపం?"...అదే ప్రశ్న.



"అన్నీ తెలిసినవాడివి, నా కోపానికి కారణం నీకు తెలియదా?" నా గొంతులో ఉక్రోషం, సంభ్రమం.... రెండూ సమ్మిళితమయ్యాయి.



"సరే అయితే..ఇంకో చిన్న ప్రశ్న. నాగురించి నీకేం తెలుసు?" ఆ గొంతులోని మార్ధవం నాకు ఒకవిధమైన ధైర్యాన్నిస్తోంది!

అప్రయత్నంగా, నాకు కరుణశ్రీ కవిత గుర్తుకొచ్చింది:



ఆణిముత్యాల జాలరీ లందగించు

నీల మణిమయ సువిశాల శాలలోన

నొంటరిగ గూరుచుండి క్రీగంట

స్వీయసృష్టి సౌందర్యమును సమీక్షింతు నీవు!

నా మనసులో మాట గ్రహించినట్లే, మళ్ళీ ఇంకో ప్రశ్న. "మరి సృష్టికర్తగా నన్నంగీకరించినపుడు, నా సృష్టినెందుకు సందేహిస్తున్నావు? ఈ సకల చరాచర జీవులు, వాటికి ఆధారమైన ఈ భూమి, నీరు, గాలి,వెలుతురు, ఈ గ్రహాలు, నక్షత్రాలు, అన్నీ కూడిన సమస్త విశ్వం.....నువ్వూ, నేనూ... ఈ సృష్టిలో పరిపూర్ణత నీకు కనబడడం లేదా?"

"పరిపూర్ణతా..? నీ సృష్టిలో అదే ఉంటే, ఇంతమంది అమాయకులెందుకు చనిపోయారు? నాకు తెలిసి వారింత భయంకరమైన చావుకు అర్హులు కారు". నాగొంతులో ఒకింత అసహనం.

"ఈ సృష్టికర్తనే నేనైనప్పుడు, మరి రైల్లో బాంబు పెట్టినవాడినీ, ఆ విస్ఫోటంలో చనిపోయిన వాడినీ సృష్టించింది నేనే కదా?"

నాలో అవేశం కట్టలు తెంచుకొంటోంది. "అదేకదా నా ప్రశ్న. నిన్నే శరణన్న ఇంతమందీ, నిన్ను ప్రేమిస్తోన్న ఎంతోమంది, ఆ బాంబు పేళుళ్ళలో చనిపోయారు... ఎందుకు? ఎందుకు నీ సృష్టిలో ఇన్ని అసమానతలు?"

ఒక్క క్షణంపాటు నిశ్శబ్దం... ఒక పలుచటి చిర్నవ్వు..."ఒక్క ప్రశ్నడుగుతాను... సూటిగా సమాధనం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" ప్రశ్న తీక్షణంగా నా గుండెను తాకింది.

ఆ ప్రశ్నలోని తీక్షణతకు నా గొంతు పెగల్లేదు.



"నా సృష్టిని పూర్తిగా వ్యతిరేకిస్తూ, అపరిపక్వతనూ, అసమానతనూ,అసంపూర్ణతనూ దానికి అపాదిస్తూ, సృష్టి కర్తనైన నన్ను మాత్రం ప్రేమిస్తున్నామంటారు.ఇదెలా సాధ్యం? మనం ఈ ప్రపంచంలో ఎవ్వరినైనా ప్రేమించాలంటే, వారు చేసే పనులను కూడా ఇష్టపడాలికదా? ఒక వ్యక్తిని ప్రేమిస్తూ, అతని పనులను మాత్రం ద్వేషించలేం కదా? అలాగే, నా సృష్టినీ, అందులో మీకు అనందం కలిగించని వాటినీ, అర్ధంకాని వాటినీ ద్వేషిస్తూ, విమర్శిస్తూ, నన్ను మాత్రం ప్రేమించడం ఎలా కుదురుతుంది? ఈ సృష్టిని ప్రేమించడం ద్వారా, ఇష్టపడదం ద్వారా మాత్రమే, సృష్టికర్తను ప్రేమించగలం అన్న సత్యాన్ని ఎవరూ గ్రహించరెందుకు? "



"నిన్నర్ధం చేసుకోవడం చాల కష్టం", కాస్త నిష్టూర పడ్డాను.

"అసలు నన్నర్ధం చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అలా చేయడం మొదలుపెట్టిన నాడు, నా మీద నీకు పూర్తి నమ్మకం లేనట్లే. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఒక్కసారి నీ రెండేళ్ళ చిన్నారిని గమనించు. ఆ చిన్నారి తన అమ్మను పూర్తిగా విశ్వసిస్తుంది, ప్రేమిస్తుంది. తను ఆనందంగా ఉన్నా, ఏడుస్తున్నా అమ్మ చేయి మాత్రం వదలదు. మన్ను తిన్న తన బిడ్డను అమ్మ మందలిస్తుంది, చిన్న దెబ్బ కూడా వేస్తుంది. ఆ బిడ్డ కూడ,ఏడుస్తూ,తనను కొట్టిన అమ్మను ఇంకా గట్టిగా కౌగలించుకుంటుంది కానీ, దూరంగా జరగదు. ఆ మందలింపు, చిన్న దెబ్బ ఆ బిడ్డకు ఆ సమయాన అవసరం. అలాగే, ఇంకొ చిన్న ఉదాహరణ. బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారిని, పాలకి సమయమైందని అమ్మ బలవంతంగా తీసుకుళ్తుంటే, ఆ చిన్నారి కోపంతో ఏడుస్తుంది. ఆ సమయంలో ఆ చిన్నారికి ఆడుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది. కానీ, తనకి అవసరం పాలు త్రాగడం...ఈ విషయం ఆ చిన్నారి గుర్తించకున్నా, తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న అమ్మకు తెలుసు. చిన్నారి కూడా,ఏడుస్తూ అమ్మనే పట్టుకుంటుంది. అదే చిన్నారి కాస్త పెద్దవగానే, తన ప్రపంచం కాస్త విస్తరించగానే,అమ్మను అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అమ్మ మీద కోపం చేసుకుంటుంది. అమ్మ చర్యలను ప్రశ్నిచడం మొదలుపెడుతుంది. అలా తన జీవన పోరాటాం మొదలౌతుంది. అమ్మకు సంబంధించినంత వరకూ, ఏమీ తేడా లేదు... ఎప్పట్లానే తన బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. వచ్చిన దూరమల్లా బిడ్డ వైపునుంచే. అమ్మను అర్ధం చేసుకోవాలనే తన ప్రయత్నం నుంచే".

(ఇంకా ఉంది)

(Moment of Clarity గురించిన 'కొత్త పాళీ' గారి చర్చ ఈ టపాకు మూలం. దేవుడితొ సంభాషణ అన్న కాన్సెప్ట్ కు ప్రేరణ యండమూరి థ్రిల్లర్, అంతర్ముఖం నవలలు, జిం క్యారీ సినిమా "బ్రూస్ అల్మైటీ". నా మార్గదర్శి శ్రీరాం గారి సాంగత్యంలో నేను నేర్చుకున్న విషయాలకు మరింత స్పష్టత కల్పించునే ప్రయత్నమే ఈ టపా...శ్రీరాం చరణం శరణం ప్రపధ్యే! )

7 comments:

jay said...

చాలా చిన్న ప్రశ్న... సృష్థి ఆది నుంచి అందరిని తొలిచివేస్తున్న ప్రశ్న. సకల చరాచర జగత్తు ఆయన సృష్టే అయినప్పుడు, మంచితో పాటు చెడుని ఎందుకు సృజించాలి? కరుణ ప్రక్కనే హింస, దీపం వెనుక చీకటిలా ఉంటూనే ఉంటోంది. గిరీష్ చాలా క్లిష్టమైన అంశం ఎంచుకున్నాడు. సమస్య ( నాది కూడ) కి దేవుడు ఏం చెపుతాడా అని చాలా ఉత్సుకతతొ ఎదురు చూస్తున్నాను.

sridhar d said...

మనలొని ప్రతిధ్వనిని ఇలా వ్యక్తపర్చడం అనందంగా వుంది. ఐతె నాదొ ప్రశ్న..ఎదిగె చిన్న పాపకి ఎన్నొ సందెహలు..ఈ గందరగొళం అంతా అర్థమూ కావు (మనకు అర్థమైందని కాదు)..చిన్నపుదు మనమూ ఆంతె !..అప్పుదు అర్థం కానివి ..ఇప్పుదు అర్థం అవుతునాయని అనుకోవలా? లెక దాని మన గ్మానం అనుకోవాలా? కలకాలం పిలల్లుగానె ఉండిపొలేం కదా..పెద్ద వాళ్ళలాగ వుండి చిన్నపిల్లల మన్స్తత్వం వున్నవాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలొ .. ఈ బతుకు పొరాటంలొ నిలబడగలుగుతునారు ? సందెహం సహజం.. పిల్లలు కొన్ని విషయాలు అర్థం చెసుకోలెరు .. ఒక తల్లి కూడ ఒక్కఫటి చిన్నపిల్లె కదా !!..మరి అలాంటప్పుదు నా ప్రశ్న భగవంతుడికి (రచయితకు)..) ప్రెమతొ కదుపు నిండదు.. అలాగె త్రిశ్ణ కుడా !!.. రాగద్వేషాలు అన్నపానీయలంత సహజం..మరి ఎదిగె పిల్ల -తల్లిని అసలు ప్రశ్నించనెకుడదా? లెక ఆలొచించకుడదా? ఈ రెందు చెస్తె ప్రశ్న మళీ మొదటికొస్తూంది !! .. ఇది నాకు అర్థం కాని పదార్థం మరి !! like conversion of telugu typing from english !!

Anurup said...

కధ బాగా చెప్పారు.

రాధిక said...

చదువుతున్నంత సేపూ అవును కదా అనిపిస్తూనే వుంది.కానీ ఈ కధలో నాకు సమాధానం దొరకలేదు.

chandramouli said...

సామూహిక హత్యలను సృష్టించిన మనిషి తను పాటించే చాంధసభావాలకు ఇంతమందిని బలిచేస్తే....దాన్ని దేవుని చర్యలుగా అభివర్ణించటం నాకు ఒకింత చోద్యంగా భాదగా తోస్తుంది..... మీరు చెప్పినది సరి అని తీసుకుంటే....సరిగ్గా ఒక సందేహం తలెత్తుతుంది....
మరి దేవును అవతారాలు అంతా ... తన అస్తిత్వనిరూపణకు చేసినవా మరి..??? అంటే.. పిల్లరాక్షసుని మెదలు, పరమ భయంకర రాక్షసులవరకు ఆయనే సృష్టి చేసి... పాపంపండింది అని చెప్పి...మానవరూపుడై సంహారం చేస్తున్నాడు.... అలా అస్తిత్వాన్ని నిరూపించుకుంటున్నాడా అని?? ....

అనుకోని/యాదృచ్చిక ప్రమాదంలో మరణించిన వారికి మీ విశ్లేషణ సరి అని నా అభిప్రాయం.....

GIREESH K. said...

చంద్రమౌళి గారూ,

నా పోస్ట్ ఇంకా పూర్తికాలేదండి. మృతులకు సంబందించినంతవరకూ ప్రమాదవశాత్తూ కలిగే మరణానికీ, ఉగ్రవాద చర్యవల్ల కలిగే మరణానికీ తేడా లేదు. మరణం మరణమే. అలాగే, సమస్తాన్నీ సృష్టించిన దేవుడికి, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవలసిన అవసరమూ లేదు, అని నా అభిప్రాయం.

I believe, the problem stems from the fact that we believe in the god we have created, out of our wisdom. There are two ways of looking at it - believing in God whom we have created, according our terms and the second one is believing in god who has created us. Here, my effort is to migrate to the second category (but, i am not sure how far i am successful). However, the fact remains that either believer or non-believer, god has created everyone. Then the question is "Why miseries?".

I hope to make an attempt to present my view on the same in my next post.

Thanks a lot for the feedback.

Cheers,
Gireesh

chandramouli said...

తదుపరిపోష్టకై వేచి చూస్తుంటాం... నెనర్లు....